తెలంగాణ ప్రభుత్వం(Telagana Government) శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డులు(Gaddar Awards) ప్రదానం చేయనున్నది. గద్దర్ పేరుతో ఇస్తున్న అవార్డ్స్ ఆహ్వానపత్రిక(Invitation Card)పై ఆయన పేరే లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి పేరు పైనేతే అవార్డులు ఇస్తున్నామో.. ఆ వాగ్గేయకారుడు గద్దర్ ఫొటో లేకపోవటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Jagruthi Leader Kavitha) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగడుతూ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే జ్ఞాపికపైన, ఆహ్వాన పత్రికపై గద్దర్ చిత్రం ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ను కాంగ్రెస్ సర్కార్ అవమానించిందని నిప్పులు చెరిగారు.
కనీసం అవార్డుల ప్రదానోత్సవ సభలోనైనా ఆయన చిత్రపటాన్ని ఉంచాలని కవిత విన్నవించారు. ఇది ఒకవైపు అయితే.. మరోవైపు గద్దర్ పేరుతో స్వీకరించేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు సిద్ధంగా లేరని, వారిని దృష్టిలో ఉంచుకొనే గద్దర్ బొమ్మ అవార్డు జ్ఞాపికపై లేకుండా సర్కార్ జాగ్రత్త పడిందని మరికొందరంటున్నారు.