Panchayat Elections: తెలంగాణ(Telangana)లో జరుగుతున్న కులగణన(Census) దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్( KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాటలు వాస్తవానికి దూరంగా ఉండటమే కాక, కాంగ్రెస్ అమలు చేస్తున్న విధానాలతో పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్టు పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుందని, ఇందుకోసం రూ.160 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిందని ఆయన అన్నారు. అయితే వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లు మాత్రమే కల్పించారన్నది కేటీఆర్ చేసిన ఆరోపణ. ఇప్పటివరకు ఉన్న 24 శాతం రిజర్వేషన్‌ను తగ్గించి 17 శాతానికి పరిమితం చేయడం కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బయట పెడుతుందని ఆయన విమర్శించారు.
బీసీల సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ, చివరకు అమల్లో మాత్రం వెనక్కి తగ్గడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన పోస్టులో ‘‘బీసీలకు హక్కులు పెంచుతామని చెబుతూనే, పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించడం ఏ ధర్మం? ప్రజల డబ్బుతో భారీ సర్వేలు చేసి, చివరకు బీసీలకు అన్యాయం చేస్తే ఎలా?’’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, రిజర్వేషన్ల తగ్గింపు మరియు పబ్లిక్ ఫండ్స్ వినియోగంలో జరిగిన అన్యాయంపై రాహుల్ గాంధీ స్వయంగా స్పందించాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు వాటి మాటలను ఖండిస్తున్నాయని, బీసీల హక్కులను రక్షించే అంశంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడుతోందని ఆయన అన్నారు. తెలంగాణలో కులగణనను ప్రసంశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు, పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ విధానం పూర్తిగా విరుద్ధంగా ఉండటమే కాకుండా, బీసీల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారింది.
