సిరిసిల్ల అడ్డాగా ఫోన్ ట్యాపింగ్
కరీంనగర్ ప్రెస్మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్ (Phone taping case) జరిగిందని, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు (Ex SiB Chief Prabhakar Rao) చాలా మంది జీవితాలను నాశనం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ (Central Minister Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. కరీంనగర్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్‌ట్యాపింగ్ చేసేవారు బీజేపీ నేతలు, వారి భార్యల ఫోన్లు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసును మామూలు పోలీస్‌లతో విచారణ చేయించడం కంటే, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(సీబీఐ) (Central Investigation Buereau)తో దర్యాప్తు చేయించాలని అభిప్రాయపడ్డారు. నాటి సీఎం కేసీఆర్, నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్‌రావు తన బృందంతో ఫోన్‌ట్యాపింగ్ చేయించారన్నారు. ఈకేసులో ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్‌కు పోలీసులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు వారేనని ఆరోపించారు.
ప్రభాకర్‌రావుకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మర్యాదలు చేయడం ఆపాలని హితవు పలికారు. గతంలో తనపై వచ్చిన పేపర్ లీక్ కేసులో ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే అరెస్టు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్‌రావు అండ్ కోను కాపాడే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చేముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణను సర్వనాశనం చేసింది కేసీఆర్, కేటీఆర్‌నే అని మండిపడ్డారు. తనకు సిట్ నుంచి విచారణకు కాల్ వచ్చిందని, తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.