end
=
Tuesday, October 28, 2025
వార్తలురాష్ట్రీయంసరెండర్ల పర్వం..లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక
- Advertisment -

సరెండర్ల పర్వం..లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక

- Advertisment -
- Advertisment -

Senior Maoist Bandi Prakash Surrender : ఆపరేషన్‌ “కగార్” (Operation Kagar)నేపథ్యంలో మావోయిస్టు పార్టీ(Maoist Party)లో లొంగుబాటు దళం కొనసాగుతోంది. ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి అగ్రనేతలు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత బండి ప్రకాశ్‌ (Bandi Prakash)అలియాస్‌ ప్రభాత్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ క్రాంతి కూడా తన దళ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బండి ప్రకాశ్‌ గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) బాధ్యుడిగా, నేషనల్‌ పార్క్‌ ఏరియాలో కీలక ఆర్గనైజర్‌గా ఆయన ఉన్నారు. ప్రభాత్‌ అనే పేరుతో పార్టీ ప్రెస్‌ టీమ్‌ ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరించారు.

ప్రకాశ్‌ మంద్రమర్రిలోని పోచమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు, అమృతమ్మ దంపతుల రెండో కుమారుడు. 1982–84 మధ్యకాలంలో అప్పటి పీపుల్స్‌ వార్‌ అనుబంధ సంస్థ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (RSU) లో చురుకైన పాత్ర పోషించారు. “గ్రామాలకు తరలండి” కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం పార్టీ నాయకత్వ దృష్టిని ఆకర్షించింది. అనంతరం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఆవిర్భావంతో అందులో మిలిటెంట్‌గా చేరారు. 1984లో మందమర్రికి చెందిన ఏఐటీయూసీ నాయకుడు వీటీ అబ్రహం హత్య కేసులో అరెస్టైన ప్రకాశ్‌ వరంగల్‌ జైలు నుంచి ఆదిలాబాద్‌ సబ్‌ జైలుకు తరలించబడ్డారు. అక్కడ పీపుల్స్‌ వార్‌ నేతలు నల్లా అదిరెడ్డి, హుస్సేన్‌, ముంజం రత్నయ్యలతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నారు. కొంతకాలం తరువాత బయటకు వచ్చి హేమను వివాహం చేసుకొని సాధారణ జీవితం గడిపారు.

కానీ తిరిగి హైదరాబాద్‌లో అరెస్టు కావడంతో చర్లపల్లి జైలులో శాకమూరి అప్పారావు తదితర అగ్రనేతల పరిచయంతో ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీ సికాస పునరుద్ధరణ బాధ్యతను ఆయనకు అప్పగించింది. రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించి, అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కాలంలో జరిగిన మావోయిస్టు శాంతి చర్చల సందర్భంలో ఆసిఫాబాద్‌ సమీపంలోని మోవాడ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహించడం ద్వారా ఆయన విశేషంగా నిలిచారు. శాంతి చర్చలు విఫలమైన తర్వాత తిరిగి అజ్ఞాత జీవితం ప్రారంభించిన ప్రకాశ్‌ గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వయస్సు మీదపడటంతో పాటు షుగర్ వ్యాధి తీవ్రత పెరగడంతో చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బండి ప్రకాశ్‌ పై రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ఆయన లొంగిపోవడం వల్ల మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలిందని అధికారులు వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ కగార్‌ అమలు వేగవంతం కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని లొంగుబాట్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -