Gold Rate: అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్ల కోతకు వెళ్తుందన్న అంచనాలు, దేశీయంగా బంగారం, వెండి ధరల (Gold and silver prices)కు ఊతమిచ్చాయి. ఈ ప్రభావంతో నేడు దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి రెండింటి ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం 10 గంటల సమయానికి బంగారం ధర 1.16 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,22,468 వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర 1.99 శాతం పెరిగి కిలోకు రూ.1,50,666కు చేరింది. గత వారం మధ్యలో కొంతమేర తగ్గిన బంగారం ధరలు మళ్లీ బలమైన పుంజుకున్నాయి. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం సూచనలు స్పష్టంగా కనిపించడం, వినియోగదారుల నమ్మకం తగ్గిపోవడం, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు వెళ్లొచ్చన్న ఊహాగానాలు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బంగారం డిమాండ్ పెరగడంతో ధరలు కూడా ఎగబాకుతున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మెహతా ఈక్విటీస్ కమొడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రీ ప్రకారం గత వారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌పై అనిశ్చితి పెరగడం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడడం వంటి అంశాలు బంగారం ధరలను మళ్లీ పైకి లాగాయి అన్నారు. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ చరిత్రాత్మక స్థాయికి చేరుకోవడంతో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగిందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లుతున్నారని వివరించారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచిందని తెలిపారు.
మరోవైపు, ముడి చమురు ధరలు కూడా నేడు పుంజుకున్నాయి. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 60 డాలర్ల మార్కును దాటింది. ఈ వారం విడుదల కాబోయే ఒపెక్ (OPEC), అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) నివేదికల కోసం గ్లోబల్ ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఒపెక్ దేశాలు ఉత్పత్తి పరిమితులపై సడలింపు చూపవచ్చన్న సంకేతాలు, అమెరికా ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలు సరఫరా మిగులు పరిస్థితిని సూచిస్తున్నాయి. దీంతో చమురు మార్కెట్‌లో మిశ్రమ ధోరణి కొనసాగుతోంది. మొత్తం మీద, బంగారం–వెండి ధరల పెరుగుదలతో పాటు ముడి చమురు పుంజుకోవడం ఆర్థిక మార్కెట్‌లో కొత్త చైతన్యం తెచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే కొన్ని వారాల్లో అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలపై ఆధారపడి ఈ వస్తువుల ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
