end
=
Sunday, January 25, 2026
వార్తలుజాతీయంసభలో డ్రామాలు వద్దు..దేశాభివృద్ధికి విపక్షాల సహకారం అవసరం: ప్రధాని మోదీ
- Advertisment -

సభలో డ్రామాలు వద్దు..దేశాభివృద్ధికి విపక్షాల సహకారం అవసరం: ప్రధాని మోదీ

- Advertisment -
- Advertisment -

Parliament Winter Session : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ( PM Modi)దేశ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలు(Political parties) కలిసిరావాలనే అవసరాన్ని మరోసారి స్పష్టం చేశారు. సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, చట్టసభలు ప్రజాస్వామ్య హృదయమని, జరిగే చర్చలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రతి అంశంపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆశిస్తున్నాను. దేశంలో మంచి మార్పులు తీసుకురావాలంటే సభ్యులందరూ కలిసి పనిచేయాలి. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా మన ప్రవర్తన ఉండాలి అని పేర్కొన్నారు. సభా కార్యక్రమాలను ఆటంకపర్చే నినాదాలు, నిరసనల కంటే, వాస్తవ సమస్యలపై చర్చలు జరిగితేనే ప్రజలు ఆశించిన ఫలితాలు వస్తాయని మోదీ హితవు పలికారు.

విపక్షాల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఓటమిని అంగీకరించే ధైర్యం ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. నిరాశను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం ముందుకు రావాలి. బలమైన అంశాలను సభలో ప్రస్తావించాలి. డ్రామాలు, అడ్డంకులు ప్రజలకు ఇక నచ్చడం లేదు అని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో విపక్షాలు అనుసరించిన వ్యూహాలు ఫలప్రదంగా లేవని, ప్రజలు వాటిని తిరస్కరిస్తున్నారని మోదీ విమర్శించారు. విపక్షాలు తమ పని తీరు మార్చుకోవాలి. వారికి అవసరమైతే కొన్ని సూచనలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చురకలు అంటించారు. జీఎస్టీ అమలు తర్వాత దేశ వ్యాప్తంగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందని ప్రధాని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంస్కరణ లక్ష్యం దేశాన్ని వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు.

భారతదేశాన్ని ప్రపంచంలో ముందంజలో నిలిపే ‘వికసిత్ భారత్‌’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. ఈసారి శీతాకాల సమావేశాలు కూడా సంస్కరణలకు కొత్త దిశ చూపిస్తాయని, ప్రజల సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సభలో అన్ని పక్షాలు శాంతంగా, బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ముందుకు సాగాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగితేనే శాసనసభల ప్రతిష్ఠ పెరుగుతుందని మోదీ అన్నారు. మొత్తం మీద, శీతాకాల సమావేశాలు రాజకీయ కలహాలకు వేదిక కాకుండా, దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాలని ప్రధాని స్పష్టం చేశారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -