Amaravati Quantum valley: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీపై విస్తృత చర్చ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ(Amaravati Quantum valley) రూపుదిద్దుకోబోతుందని ఆయన స్పష్టం చేశారు. వేలాది మంది టెక్నాలజీ విద్యార్థులతో ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ‘క్వాంటమ్ టాక్’ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని క్యూబిట్, వైసర్ సంస్థల సహకారంతో నిర్వహించారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుందని చంద్రబాబు అన్నారు.
ఆరోగ్యం, వ్యవసాయం, ఫైనాన్స్, రక్షణ, అంతరిక్ష పరిశోధనలు వంటి అనేక రంగాల్లో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందన్నారు. యువత ఈ కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. చరిత్రను ప్రస్తావిస్తూ, 1970లో చైనా ఆర్థిక సంస్కరణలు అమలు చేసి వేగంగా అభివృద్ధి సాధించిందని, అదే తరహాలో 1991లో భారత్ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఆ సంస్కరణల తర్వాత దేశం వెనుదిరిగి చూడలేదన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది వేశాయని చెప్పారు. హరిత విప్లవం కారణంగా భారతదేశం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించిందని వివరించారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సామాన్యుల సాధికారతే లక్ష్యంగా అనేక సంస్కరణలు తీసుకువస్తోందని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని ప్రజల జీవితాలతో అనుసంధానం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. విశాఖపట్నం ఐటీ రంగానికి ఆకర్షణీయ గమ్యంగా మారుతోందని, ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ, ఆధునిక సాంకేతికతకు విశాఖ కేంద్రబిందువుగా మారబోతోందన్నారు. అదే విధంగా తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్‌లు, పరిశోధనలకు ఇది కీలక వేదికగా నిలుస్తుందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, విశాఖ ఐటీ హబ్, తిరుపతి స్పేస్ సిటీతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టెక్నాలజీ రాష్ట్రంగా ఎదగబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
