Telangana : తెలంగాణ రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping case) వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)( Sit) గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ నేతలకు నోటీసులు జారీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆ(KCR)తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావుల, (Harish Rao)కు త్వరలోనే సిట్ నోటీసులు(SIT NOTICES) అందే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ చర్యలు అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగాయని దర్యాప్తు అధికారుల ముందు పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలతో కేసు మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు రివ్యూటీ కమిటీలో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మరోసారి విచారించారు. సాధారణ పరిపాలన శాఖకు చెందిన మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావును కూడా ప్రశ్నించి, ఫోన్ ట్యాపింగ్ కోసం నంబర్ల మంజూరు, అధికారిక అనుమతుల అంశాలపై వివరాలు సేకరించారు. ఇదే క్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి నవీన్ చంద్రకు కూడా సిట్ తిరిగి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఎండీతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ట్యాపింగ్ చర్యలు చేపట్టినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొందరు ప్రముఖులపై నిఘా పెట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతో పాటు పౌర సమాజ ప్రతినిధులు, సొంత పార్టీ నేతలపైనా నిఘా పెట్టిన కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కొందరు అధికారులు అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలా జరిగితే, గత ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉండటంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
