Telangana : తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల(unemployed)కు శుభవార్త దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పోలీస్ శాఖ(State Police Department)లో భారీ ఎత్తున నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. సుమారు 14 వేల స్టయిపెండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టుల(Constable posts)తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నియామకాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు డీజీపీ తెలిపారు. అన్ని ప్రక్రియలు తుదిదశకు చేరుకున్నాయని, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2016, 2018, 2022 సంవత్సరాల్లో మూడు విడతలుగా పోలీస్ నియామకాలు జరిగాయి. అయితే 2023 నుంచి కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ప్రత్యేకంగా వయోపరిమితి సమస్య అభ్యర్థులను తీవ్రంగా కలవరపెడుతోంది. కొందరు అభ్యర్థులు చివరి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందన్న భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో డీజీపీ ప్రకటన వారి ఆశలను మళ్లీ చిగురింపజేసింది. ఉద్యోగాల భర్తీ ఆలస్యం కావడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరం పదవీ విరమణలు అధికమవుతుండటంతో సిబ్బంది కొరత తీవ్రంగా మారింది.
కొత్త నియామకాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బందిపై పనిభారం గణనీయంగా పెరిగింది. దీని ప్రభావం క్షేత్రస్థాయిలోని పనితీరుపై కూడా పడుతోందని పోలీస్ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రతి రెండేళ్లకోసారి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తేనే సిబ్బంది సమతుల్యత నిలబడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నియామకాలపై ముందడుగు వేస్తోంది. త్వరలో వెలువడే నోటిఫికేషన్‌తో నిరుద్యోగుల దీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందని, రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
