Vande Bharat Sleeper: భారతీయ రైల్వే(Indian Railways)ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper Train) కీలకమైన మైలురాయిని దాటింది. ఈ అత్యాధునిక రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవడం దేశ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. కోటా–నాగ్డా సెక్షన్ మధ్య నిర్వహించిన ఈ పరీక్షలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వరకు గరిష్ఠ వేగంతో ప్రయాణించి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ ట్రయల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో రైలు వేగం, సాఫీగా సాగుతున్న ప్రయాణం, సాంకేతిక నాణ్యత స్పష్టంగా కనిపించడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా రైలు స్థిరత్వాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన ‘వాటర్ టెస్ట్’ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ వినూత్న పరీక్షలో, రైలు లోపల టేబుల్‌పై పిరమిడ్ ఆకారంలో ఒకదానిపై ఒకటి పేర్చిన నీటి గ్లాసులను ఉంచారు. రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నప్పటికీ, ఆ గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వీడియోలో మొబైల్ స్పీడోమీటర్‌పై 182 కిలోమీటర్ల వేగం కనిపించినా, రైలు ఎక్కడా కుదుపులకు లోనుకాకుండా అద్భుతంగా సాఫీగా ప్రయాణించిందని మంత్రి పేర్కొన్నారు. ఇది కొత్త తరం భారతీయ రైళ్లలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతకు ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరగడం గమనార్హం. భద్రత, స్థిరత్వం, వేగం – ఈ మూడు అంశాల్లోనూ వందేభారత్ స్లీపర్ రైలు అత్యున్నత ప్రమాణాలను అందుకుంటుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో నడుస్తున్న వందేభారత్ రైళ్లు సెమీ హైస్పీడ్ చైర్ కార్ సేవలకే పరిమితమయ్యాయి. అయితే దీర్ఘదూర ప్రయాణాలు చేసే వారు, ముఖ్యంగా రాత్రివేళల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్లీపర్ వెర్షన్‌ను రూపొందించారు. ఆధునిక ఏసీ కోచ్‌లు, మెరుగైన నిద్ర సౌకర్యాలు, విమాన తరహా ఇంటీరియర్ డిజైన్‌తో ఈ రైళ్లు ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నాయి. ఈ రైళ్లు వాణిజ్య సేవల్లోకి వస్తే, రద్దీగా ఉండే ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణానికి కొత్త దశ ప్రారంభమవుతుందని రైల్వే శాఖ అభిప్రాయపడుతోంది.
Vande Bharat Sleeper tested today by Commissioner Railway Safety. It ran at 180 kmph between Kota Nagda section. And our own water test demonstrated the technological features of this new generation train. pic.twitter.com/w0tE0Jcp2h
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 30, 2025
