India: ఈ ఏడాది భారత్–పాకిస్థాన్‌ల (India-Pakistan) మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గేందుకు తామే మధ్యవర్తిత్వం వహించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (China Wang Yi)చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ(Ministry of External Affairs of India) తీవ్రంగా ఖండించింది. పాక్‌తో కుదిరిన కాల్పుల విరమణ అంగీకారం పూర్తిగా ద్వైపాక్షిక నిర్ణయమేనని, ఇందులో ఏ దేశం లేదా మూడో పక్షం జోక్యం లేదని స్పష్టంగా వెల్లడించింది. ఈ నిర్ణయం రెండు దేశాల సైనిక డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య జరిగిన చర్చల ఫలితమని మరోసారి నొక్కి చెప్పింది. పాక్‌తో కాల్పుల విరమణపై భారత్ తన వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని విదేశాంగ శాఖ గుర్తుచేసింది. సరిహద్దు ఉద్రిక్తతల నిర్వహణలో భారత్ ఎల్లప్పుడూ స్థిరమైన విధానాన్ని అనుసరిస్తోందని, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారాలను వెతుకుతుందన్నదే తమ నిశ్చితమైన విధానమని తెలిపింది.
ఈ నేపథ్యంలో చైనా చేసిన మధ్యవర్తిత్వ వ్యాఖ్యలకు వాస్తవాలతో సంబంధం లేదని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇదిలా ఉండగా, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం మాట్లాడుతూ, భారత్–పాక్‌ల మధ్య ఈ ఏడాది ఏర్పడిన ఉద్రిక్తతల సడలింపుకు చైనా మధ్యవర్తిత్వం చేశామని పేర్కొన్నారు. అంతేకాదు, ఉత్తర మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభం, ఇరాన్ అణు సమస్య, ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య ఉద్రిక్తతల పరిష్కారంలోనూ బీజింగ్ పాత్ర ఉందని ఆయన చెప్పారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల్లో చైనా సానుకూలంగా జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయాన్ని వాంగ్ యీ వ్యక్తం చేశారు.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి మరియు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిందన్న అంశం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ మూలాలున్న ట్రంప్ సహాయకుడు రికీ గిల్‌ను అమెరికా ప్రభుత్వం ఇటీవల సత్కరించి అవార్డు ప్రదానం చేయడం గమనార్హంగా మారింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తూ, భారత్ తన అధికారిక ప్రకటనల ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. భారత్–పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ అనేది రెండు దేశాల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందమే తప్ప, ఎవరైనా మూడో పక్షం సాధించిన ఫలితం కాదని. ఈ ప్రకటనతో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరోసారి రుజువు చేసింది. సరిహద్దు భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో బాహ్య జోక్యానికి తావు లేదన్న సంకేతాన్ని కూడా ప్రపంచానికి స్పష్టంగా పంపింది.
