CP Brown: తెలుగు భాషా ప్రగతికి, సాహిత్య వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగ(State festival)గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt)చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం నవంబర్ 10న సీపీ బ్రౌన్ జయంతిని అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన అనుపమాన సేవలను గుర్తు చేసింది. తన ఖాళీ సమయాన్ని, వ్యక్తిగత సంపాదనలోని ప్రతి రూపాయిని తెలుగు భాషా సంరక్షణకు, పునరుజ్జీవనానికి అంకితం చేశారు. తెలుగు భాషా వ్యాకరణం, నిఘంటువులు, కవితా సంపుటాలు, పురాతన గ్రంథాల సంరక్షణలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంగ్లాండ్‌లో జన్మించిన బ్రౌన్, తూర్పు భారత కంపెనీలో అధికారి గా భారతదేశానికి వచ్చిన తర్వాత తెలుగు భాషపై మమకారం పెంచుకున్నారు. ఆయన రాయలసీమ ప్రాంతాల్లో పనిచేసే సమయంలో తెలుగు ప్రజలతో మమేకమై, భాషను లోతుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత తెలుగు వ్యాకరణం, నిఘంటువు, కవితా సంపుటాల సంపాదకుడిగా, భాషా శోధకుడిగా నిలిచారు. తెలుగు భాషా పునరుజ్జీవనానికి తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు గా ప్రభుత్వం ఆయనను ప్రశంసించింది. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా సేవలందించిన బ్రౌన్, తెలుగు భాషపై పరిశోధనలను కొనసాగిస్తూ, తాను సేకరించిన పాత పుస్తకాలను సంరక్షించేందుకు ప్రత్యేక నిధులను వెచ్చించారు. ఆయన సేకరించిన అరుదైన తెలుగు పుస్తకాలు, ప్రతులు నేటికీ తెలుగు విశ్వవిద్యాలయాల్లో, బ్రిటిష్ లైబ్రరీల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ఈ నిర్ణయంతో సీపీ బ్రౌన్ చేసిన కృషికి సరైన గౌరవం లభించిందని సాహిత్య వర్గాలు అభిప్రాయపడ్డాయి. భవిష్యత్తులో తెలుగు భాషా వారసత్వాన్ని, సాహిత్య సంపదను యువతకు పరిచయం చేయడానికి ఈ వేడుకలు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సీపీ బ్రౌన్ స్మారక కార్యక్రమాలు, సాహిత్య సభలు, తెలుగు పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని పర్యాటక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్ స్ఫూర్తితో తెలుగు సాహిత్యాభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం తెలుగు సంస్కృతిని, భాషా గౌరవాన్ని మరింతగా ప్రోత్సహించనున్నదని భావిస్తున్నారు.
