Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల రిజర్వేషన్ల(BC reservations) అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి(Telangana Jagruti)ఆధ్వర్యంలో నిర్వహించిన మానవహారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ బిడ్డలు తమకు న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారు రిజర్వేషన్లు కోరుకుంటున్నారు. ఇది వారి హక్కు, దయాదాక్షిణ్యం కాదు అని స్పష్టం చేశారు. బంద్‌కు మద్దతుగా పలువురు రాజకీయ పార్టీలు ప్రకటించిన ప్రకటనలపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే బీసీలను మోసం చేసిన పార్టీలే ఇప్పుడు బంద్‌కు మద్దతు ఇస్తున్నామంటూ డ్రామాలు చేస్తున్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును ఆమోదించలేని బీజేపీ ఇవి రెండూ ఒకే తాటిపై ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హంతకులే నివాళులు అర్పిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు అని విమర్శించారు.
ఆమె బీసీల రిజర్వేషన్ సమస్యను తేల్చేందుకు, ఒక స్పష్టమైన రాజకీయ స్పష్టత అవసరమని అన్నారు. టెక్నికల్ కారణాలు చెబుతూ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించడం లేదు. అందుకే తీర్పులు ప్రతికూలంగా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జనగణన నిర్వహించకపోవడమే దీనికి ఉదాహరణ. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు. అందుకే ఆ జీవోను న్యాయస్థానం కొట్టివేసింది అని గుర్తు చేశారు. ఇంకా, బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలకముందే ఎన్నికలు జరపాలన్న ప్రయత్నాలను కవిత తీవ్రంగా ఖండించారు. ఇప్పుడే ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడులో ఎన్నికలు 5 ఏళ్లపాటు వాయిదా పడ్డాయి. ఇక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు జరపాలి అని అభిప్రాయపడ్డారు.
సర్పంచులకు బిల్లులు విడుదల చేయకుండా వారిని ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ చర్యలు కూడా కవిత దుయ్యబట్టారు. బీసీలకు న్యాయం జరగాలంటే, పాలక పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. నమ్మకంగా, పట్టుదలతో పని చేయాలి. లేకపోతే బీసీల నూతన ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు. తుదకు, బంద్‌ను విజయవంతం చేయాలన్న ఆమె పిలుపు ఇస్తూ ఇది కేవలం ఒక రోజు పోరాటం కాదు. బీసీల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలా ప్రజల మద్దతుతో ముందుకు సాగాలి,” అని ఉద్ఘాటించారు.
