Minister Lokesh : ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్(Global economic powerhouse)గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు అత్యున్నత భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్, మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ (Austrade) ప్రతినిధులతో జరిగిన రౌండ్-టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయుడి దార్శనిక నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళుతోంది. గత 16 నెలల్లోనే 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రంలో ఆకర్షించామని ఆయన తెలిపారు. “సుదీర్ఘ పాలనానుభవం గల సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు.
ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం పెట్టుబడులకు విస్తృత అవకాశాలను అందిస్తున్నదని ఆయన చెప్పారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన ‘ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0’తో పాటు 24 థీమెటిక్ పాలసీలు పారిశ్రామిక అభివృద్ధికి కీలక మౌలిక సూత్రాలుగా ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ముఖ్యంగా ఏఐ, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6 పోర్టుల ద్వారా ఏటా 193 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా, వచ్చే ఏడాది మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ప్రారంభమయ్యే అవకాశముందని, తద్వారా మొత్తం సామర్థ్యం 350 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని ఆయన వెల్లడించారు. విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారుతోందని లోకేశ్ తెలిపారు. గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందని, ఆర్సెలర్ మిట్టల్ 1.35 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నదని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో వచ్చే జనవరి నుంచి దక్షిణాసియాలో తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలను ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇది భారత టెక్నాలజీ రంగానికి గేమ్-చేంజర్ అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో వ్యవస్థాపక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. అతను నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025 లో పాల్గొని, ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను ప్రత్యక్షంగా చూపించాలని ఆహ్వానించారు.
