end
=
Tuesday, October 28, 2025
వార్తలుఅంతర్జాతీయంభారత్‌పై విషం కక్కిన ‘బంగ్లా’.. ఆ దేశ‌పు మ్యాప్‌లో మ‌న ఈశాన్య రాష్ట్రాలు
- Advertisment -

భారత్‌పై విషం కక్కిన ‘బంగ్లా’.. ఆ దేశ‌పు మ్యాప్‌లో మ‌న ఈశాన్య రాష్ట్రాలు

- Advertisment -
- Advertisment -

Bangladesh : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)మరోసారి భారత్‌(India)తో దౌత్యపరమైన వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఈసారి ఏకంగా భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా భారత ఈశాన్య రాష్ట్రాలను(Northeastern states) తమ దేశ భూభాగంలో చూపించే వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్ సైనిక జనరల్‌కు బహుమతిగా ఇచ్చి దుస్సాహసానికి ఒడిగట్టారు. పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైైర్‌పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా తాజాగా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ దేశ తాత్కాలిక అధినేత యూనస్ ఈ సందర్భంగా పాక్ జనరల్‌కు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంప్’ అనే పుస్తకాన్ని బహూకరించారు. ఈ పుస్తక ముఖచిత్రంపై ఉన్న బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు ఉండటం వివాదానికి తెరలేపింది. బహూకరణకు చిత్రాలను బంగ్లా ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టు చేయగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కించపరిచేలా యూనస్ వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించాల్సి ఉంది. గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ఆ దేశపు తాత్కాలిక అధినేత యూనస్ బాధ్యతలు చేపట్టారు. యూనస్ ఆ తర్వాత నుంచి పాకిస్థాన్‌కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ, -రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను బలపరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది.

గ‌తంలోనూ యూన‌స్ వ్యాఖ్య‌లు

యూనస్ గతంలోనూ భారత్‌లోని ఈశాన్య ప్రాంతంపై విషం కక్కటం ఇది మొదటిసారి కాదు. అనేక విదేశీ వేదికలపై నోరు పారేసుకున్నారు. ఈ ఏడాది చైనాలో పర్యటించిన యూనస్ ‘భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. ఆయా రాష్ట్రాల వారు సముద్రానికి చేరుకునేందుకు వేరే మార్గం లేదు. ఈప్రాంతంలో సముద్రానికి బంగ్లాదేశే రక్షకురాలు. కాబట్టి ఇది బంగ్లాకు మంచి అవకాశం. చైనా ఆర్థికపరమైన వాణిజ్య సంబంధాలను విస్తరించుకునేందుకు మంచి ఛాన్స్’ అంటూ వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో యూనస్ ‘బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరం’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ‘బంగాళాఖాతం పొడవునా భారత్‌కు 6,500 కి.మీ. మేర తీరరేఖ ఉంది. భారత్ ఐదు ‘బిమ్‌స్టెక్’ సభ్య దేశాలతో సరిహద్దును కలిగిఉంది. భారత ఈశాన్య ప్రాంతం బిమ్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతున్నది. ఆ ప్రాంతంలో రహదారులు, రైల్వే, జల మార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ అందుబాటులోకి వచ్చి పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానమవుతున్నది’ అని స్పష్టం చేసి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -