AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల (Police constables)నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేయగా, ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా హాజరుకానున్నారు. పోలీసు శాఖలో అడుగుపెడుతున్న యువతకు స్వాగతం పలికేందుకు, వారి కష్టానికి అభినందనలు తెలియజేయేందుకు ముఖ్యమంత్రి స్వయంగా హాజరవడం విశేషంగా భావిస్తున్నారు.
ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణకు ముందు నిర్వహించే ఈ సమావేశం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం నోటిఫికేషన్ జారీ చేసి, నియామకాలను దీర్ఘకాలం ఆలస్యం చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రిక్రూట్‌మెంట్‌కు అడ్డుగా ఉన్న 31 రిట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించింది. అనంతరం కేవలం 60 రోజుల వ్యవధిలోనే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే జిల్లాల వారీగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,014 మంది ఎంపిక కాగా, వారిలో 5,757 మంది శిక్షణకు అర్హత పొందారు. వీరిలో సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. మొత్తం ఎంపికైన వారిలో 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం గమనార్హం. ఇటీవలే మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు శాఖలోనూ నియామకాలను పూర్తి చేయడం ద్వారా ఉపాధి కల్పనలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. ఇది యువతకు ఆశాభావాన్ని కలిగించే కీలక అడుగుగా భావిస్తున్నారు.
