Delhi Pollution: దీపావళి పండగ (Diwali festival)ముగిసి రెండు రోజులు గడిచినా, ఆ సంబరాల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీని ఇంకా వీడలేదు. పండుగ సమయంలో కాలిన బాణాసంచా(Burnt fireworks), వాహనాల ధూమపానాల మేళవింపుతో నగరాన్ని దట్టమైన పొగమంచు (Dense fog)చుట్టుముట్టింది. ఈ ప్రభావంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం నాటి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వివరాల ప్రకారం, నగరంలోని సగటు వాయు నాణ్యత సూచీ (AQI) 345గా నమోదైంది. ఉదయం 6:15కి అశోక్ విహార్, బవానా, దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో AQI 380కి చేరింది. ఇది ‘చాలా ప్రమాదకరం’ కేటగిరీలోకి వస్తుంది. డీటీయూ, లోధీ రోడ్, ఐజీఐ ఎయిర్‌పోర్ట్ వంటి కొన్ని ప్రాంతాల్లో AQI 300లోపు ఉండగా, అది కూడా ‘ప్రమాదకరం’ స్థాయిలోనే ఉంది.
నిన్నటి రోజున ద్వారక (417), వజీర్‌పూర్ (423), ఆనంద్ విహార్ (404), అశోక్ విహార్ (404) ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రమైన’ స్థాయికి చేరిందని CPCBకి చెందిన ‘సమీర్’ యాప్ ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భారత వాతావరణ శాఖ (IMD), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) సూచనల మేరకు, గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశను ఢిల్లీలో అమలు చేస్తున్నారు. కాలుష్యానికి కేవలం దీపావళి సమయంలో కాలిన బాణసంచా మాత్రమే కారణం కాదని, వాహనాలు, పరిశ్రమలు, ఇతర మూలాల నుంచీ వచ్చే పొగలు కూడా ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (DSS) విడుదల చేసిన డేటా ప్రకారం, సోమవారం నాటి కాలుష్యంలో వాహనాల వాటా 15.6%, పరిశ్రమలు మరియు ఇతర మూలాల వాటా 23.3%గా ఉంది.
ఈ తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. శ్వాస సంబంధిత సమస్యలు, కళ్ల మంటలు, అలసట వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. “ఇది ఒక్కరోజు సమస్య కాదు, సంవత్సరాలుగా ఇలాగే ఉంది. రాజకీయ నాయకులను నిందించడం సులభం. కానీ మనం కూడా బాధ్యత తీసుకోవాలి. టపాసులు కాల్చిన తర్వాత పరిణామాలను స్వీకరించాలి” అని స్థానిక నివాసి సాగర్ పేర్కొన్నారు. దీపావళికి ముందు సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఉపయోగించాలన్న ఆదేశాలు ఇచ్చినప్పటికీ, నగరంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగింది. దీంతో వాతావరణ నాణ్యత మరింత దిగజారి, సాధారణ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి.
