Diwali 2025: భారతదేశంలో అత్యంత మహత్త్వంగా, అత్యధికంగా జరుపుకునే పండుగలలో దీపావళి (Diwali )ఒకటి. దీన్ని “కాంతుల పండుగ”గా పిలుస్తారు. దీపావళి అనేది మంచి పై చెడు సాధించిన విజయం, చీకటిపై వెలుగు ఘనతకు చిహ్నం. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య( Kartik Amavasya)నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు చీకటి రాత్రిని వేలాది దీపాలతో, రంగుల రేఖలతో ప్రకాశింపజేయడం ఒక ఆచారంగా ఉంది. ఇతిహాస పరంగా చూస్తే, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగొచ్చిన రోజున ప్రజలు ఆనందంలో దీపాలను వెలిగించి స్వాగతం పలికారు. అప్పటి నుంచి ఈ పండుగ ఒక సంప్రదాయంగా మారింది. అప్పటిలాగే నేటికీ ప్రజలు తమ ఇళ్లను పూలతో, రంగోలీలతో, దీపాలతో, రంగుల బల్బులతో అలంకరించడం చూస్తుంటాం.
దీపావళి ఐదు రోజుల పండుగ. ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంది. మొదటి రోజు ధన త్రయోదశి (ధనత్రయోదశి), రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవ రోజు గోవర్ధన పూజ లేదా బాలిపాడ్యమి, ఐదవ రోజు భాయి దూజ్. ఈ ఐదు రోజులు కూడా ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, కుటుంబ బంధాలను బలోపేతం చేసేలా ఉన్నాయి. దీపావళి రోజున ప్రత్యేకంగా దీపాలను బేసి సంఖ్యలో వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఉదాహరణకు 5, 7, 9, 11, 21, 51, 101 వంటి సంఖ్యలలో దీపాలను వెలిగిస్తారు. బేసి సంఖ్యలు శుభ సూచకమని పురాణ విశ్వాసం. ఈ దీపాలను ముఖ్యంగా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో వెలిగిస్తే ధన, ఐశ్వర్యం ఇంట్లో ప్రవేశిస్తాయని నమ్మకం ఉంది.
దీపావళి నాడు ఆవాల నూనెతో దీపాలు వెలిగించడం కూడా ఒక పరంపర. ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి, శుభ శక్తిని పుట్టించడంలో సహాయపడుతుందన్న విశ్వాసం ఉంది. ఇంటి ప్రధాన ద్వారం, వంటగది, పూజా గది వంటి ప్రదేశాలలో దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. దీపావళి రోజు వెలిగించే ఒక్క దీపమే కాకుండా, ప్రతి దీపం ఒక శుభ సంకేతం. ఇది చీకటి మీద వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగ మన జీవితాల్లోని అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును నింపే విధంగా ప్రేరణనిస్తుందనే సందేశాన్ని అందిస్తుంది. ఈ దీపావళి, మన ఇళ్లను మాత్రమే కాకుండా మన మనసులను కూడా వెలుగులతో నింపుకుందాం. మనలోని మంచితనానికి పోషణ కలిగిస్తూ, చెడును తొలగించే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లేందుకు దీపావళి మార్గదర్శకమవుతుంది.
