VC Sajjanar : సాధారణ ప్రజలతో పాటు ఉన్నత స్థాయి అధికారులను కూడా సైబర్ మోసగాళ్లు (Cyber fraudsters)టార్గెట్ చేస్తోన్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (VC Sajjanar)పేరును దుర్వినియోగం చేస్తూ జరిగిన మోసం మరోసారి దీనికి నిదర్శనం. ఆయన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ సృష్టించిన కేటుగాళ్లు, ఆయన సన్నిహితుడిని నమ్మబలికించి లక్ష్యాన్ని సాధించారు. ఈ విషయాన్ని స్వయంగా సజ్జనార్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం అపరిచితులు తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తూ, అందులో నుంచి అనేక మందికి సందేశాలు పంపారు.
తాను అత్యవసర పరిస్థితిలో ఉన్నానని, తక్షణ ఆర్థిక సహాయం కావాలని అభ్యర్థిస్తూ మెసేజ్‌లు పంపడంతో ఆయన స్నేహితుల్లో ఒకరు అవి అసలైనవని భావించి నేరగాళ్ల ఖాతాకు రూ.20,000 బదిలీ చేశారు. తాను ఎప్పుడూ ఇలా డబ్బులు అడగనని, ఆ ఖాతా పూర్తిగా నకిలీవేనని ఆవేదన వ్యక్తం చేసిన సజ్జనార్, తన అధికారిక ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను తప్ప మిగతా అన్ని అకౌంట్లు ఫేక్ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. ముఖ్యంగా తన పేరుతో కానీ, ఏ ఇతర ప్రముఖుల పేర్లతో కానీ వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను వెంటనే అంగీకరించవద్దని, ముందుగా వాటి నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పారు. మెసేజ్ ద్వారా డబ్బు పంపాలని కోరితే ఏ మాత్రం నమ్మకూడదని, అవసరమైతే ఆ వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి విషయం ధృవీకరించుకోవాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలు, లింకులు, రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం అవసరమని తెలియజేశారు.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‍కు కాల్ చేయాలని, అవసరమైతే సంబంధిత అంశాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అంతేకాక, మెటా సహకారంతో హైదరాబాదు సైబర్ క్రైమ్ విభాగం ఈ నకిలీ అకౌంట్లను గుర్తించి తొలగించే ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన వెల్లడించారు. సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాలు దాల్చుతున్న నేపథ్యంలో, ప్రజలు స్వల్ప నిర్లక్ష్యంతోనే మోసగాళ్లకు బలి కావడం సాధారణమైపోతోంది. ఇదే విషయాన్ని ఉదాహరిస్తూ, సజ్జనార్ చేసిన హెచ్చరికలు ప్రతి సోషల్ మీడియా వినియోగదారుడి కూడా అప్రమత్తత అవసరమనే విషయం స్పష్టంగా గుర్తుచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ప్రతి అభ్యర్థనను, సందేశాన్ని పరిశీలించి జాగ్రత్తగా వ్యవహరించడమే ఇలాంటి మోసాలను నివారించే మార్గమని ఆయన పునరుద్ఘాటించారు.
