India Russia Relations: భారత్ మరియు రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరొక కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటన(India tour)కు రాబోతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒప్పందం అమలు అయితే, రష్యాలో భారతీయ నిపుణులకు వేలాదిరోజుల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి, అలాగే కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణను కూడా అందిస్తుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. అందువలన, నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారతీయ నిపుణులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమలు కాగానే, ఇప్పటికే రష్యాలో ఉన్న భారతీయుల భద్రతకు చట్టపరంగా హామీ లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉన్నట్లు అంచనా.
మాస్కో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. IBA అధ్యక్షుడు సమ్మీ మనోజ్ కొత్వానీ మాట్లాడుతూ..ప్రపంచంలో అత్యంత నైపుణ్యం, కృషి మరియు చైతన్యం గల వర్క్‌ఫోర్స్ భారత్‌లో ఉంది. రష్యా పారిశ్రామికంగా కీలక దశలో ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకూ లాభదాయకం; రష్యా అవసరాలను తీర్చడమే కాకుండా, భారత నిపుణులకు గౌరవప్రదమైన, సురక్షితమైన ఉపాధి లభిస్తుంది అని చెప్పారు. గతంలో కొన్ని సందర్భాలలో భారతీయులు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, ఈసారి అలాంటివి మళ్లీ జరగకుండా IBA ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రకటించింది. ఇందుకోసం, ఇరు దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలతో కలిసి సమన్వయం సాధిస్తామని పేర్కొంది. రష్యాకు వెళ్లే కార్మికుల కోసం అవగాహన కార్యక్రమాలు, భాషా శిక్షణ, నైతిక నియామక పద్ధతుల అనుసరణ వంటి సహకార చర్యలు తీసుకోనున్నారు. అలాగే, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, రష్యా స్థానిక అధికారులతో సమన్వయం చేసుకొని, అక్కడ పని చేసే భారతీయుల సంక్షేమం, సౌకర్యాలను నిర్ధారించడంలో పూర్తిగా సహకరిస్తుందని IBA స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు కాగానే, రష్యాలో భారతీయ వలస కార్మికుల భవిష్యత్తు మరింత సురక్షితంగా, స్థిరంగా మారనుందని ఆశాజనకంగా చెప్పవచ్చు.
