Nara Lokesh: విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలుస్తారని, కానీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్(Jagan) మాత్రం అసత్య ప్రచారాలతో రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో కూడా జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫేక్ న్యూస్ (Fake news)వ్యాప్తి చేస్తున్నారని ఆయన విమర్శించారు. లోకేశ్ మాట్లాడుతూ..ప్రజల కష్టాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం జగన్‌కు సిగ్గు చేయవలసిన విషయం. విపత్తుల సమయంలో నాయకత్వం చూపించాలి గానీ, అబద్ధాలు ప్రచారం చేయడం నాయకత్వం కాదు అని ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
బెంగళూరు ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటూ దొంగ మీడియా ద్వారా ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రవర్తిస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుభూతి చూపకుండా, అసత్య ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం అనైతికం అని వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపట్టిందని. ప్రభుత్వం బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం, నీరు, వైద్య సేవలు, అవసరమైన సదుపాయాలను అందిస్తోంది. అక్కడ ఉన్న వారెవరూ ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అని వివరించారు.
అలాగే ప్రజలను అపోహలు నమ్మవద్దని కోరుతూ వదంతులు, ఫేక్ ప్రచారాలకు లోనవ్వకండి. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రతి ఒక్కరి భద్రత, సంక్షేమం మా ప్రాధాన్యత అని లోకేశ్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సాయం అందించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1800–425–0101 ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ నంబర్ ద్వారా ఏ సమస్యనైనా ప్రజలు ప్రభుత్వానికి నేరుగా తెలియజేయవచ్చని చెప్పారు. మొత్తం మీద, విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉండే బాధ్యతను ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తిస్తోందని, కానీ రాజకీయ లాభం కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసం మన బలం. విపత్తు సమయంలో సహాయం చేయడం మానవత్వం, దానిని రాజకీయ ముసుగులో కించపరచడం పాపం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
