end
=
Monday, November 3, 2025
వార్తలుజాతీయంరేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో
- Advertisment -

రేపు ఎల్‌వీఎం3–ఎం5 ప్రయోగం.. సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో

- Advertisment -
- Advertisment -

ISRO : ఇస్రో మరో మహత్తర ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అత్యంత శక్తివంతమైన రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం5 (LVM3-M5)ను ఈ ఆదివారం సాయంత్రం అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (SHAR), శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్‌ సాయంత్రం 5.26 గంటలకు లిఫ్ట్‌ ఆఫ్‌ అవనుంది. ఈ రాకెట్‌ ద్వారా సీఎంఎస్‌–03 (CMS–03) అనే అధునాతన సమాచార ఉపగ్రహాన్ని భూమి స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని సాంకేతిక దశలను విజయవంతంగా పూర్తిచేశారు. శనివారం సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది. ఇది మొత్తం 25 గంటలు 30 నిమిషాలు కొనసాగనుంది. ఈ సమయంలో ఇంధన నింపడం, సిస్టమ్‌ తనిఖీలు, రాకెట్‌ స్టేజింగ్‌ పరీక్షలు వంటి కీలక పనులు జరుగుతాయి.

ఎల్‌వీఎం3 రాకెట్‌ ఇస్రో ఇప్పటివరకు రూపొందించిన అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం. ఇది సుమారు 4,400 కిలోల బరువైన సీఎంఎస్‌–03 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తరువాత ఉపగ్రహం తన నిర్దేశిత జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (GTO)‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఉపగ్రహం స్వయంగా తన తుది స్థితికి చేరుతుంది. సీఎంఎస్‌–03 ఉపగ్రహం భారతదేశ కమ్యూనికేషన్‌ రంగంలో కొత్త దశను ప్రారంభించనుంది. ఇది అధిక బ్యాండ్‌విడ్త్‌ సామర్థ్యంతో కూడిన ఉపగ్రహంగా రూపొందించబడింది. దేశవ్యాప్తంగా దూరప్రాంతాలకు కూడా మెరుగైన టెలికమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, మరియు డిజిటల్‌ కనెక్టివిటీ సేవలు అందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి ఇంత బరువైన సమాచార ఉపగ్రహాన్ని స్వదేశీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపుతోంది. ఇప్పటి వరకు ఇలాంటి భారీ పేలోడ్లను సాధారణంగా వాణిజ్య ప్రయోగ వాహనాల సహాయంతోనే పంపేవారు. కానీ ఇప్పుడు భారత్‌ స్వయంగా అలాంటి సామర్థ్యాన్ని సాధించడం దేశ అంతరిక్ష శక్తిని మరింత బలపరుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇస్రో అంతరిక్ష సాంకేతిక రంగంలో మరో మైలురాయిని చేరుతుంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల్లో కూడా భారత స్థానం మరింత బలపడనుంది. అంతరిక్ష పరిశోధనలో స్వావలంబన దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక, ఈ ప్రయోగం సజావుగా సాగేందుకు సతీష్‌ ధవన్‌ కేంద్రంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేశ ప్రజలంతా ఇస్రో కొత్త విజయాన్ని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -