Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ(Police Department)లో ఒక అరుదైన ఘటన కలకలం రేపింది. రక్షించాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారి స్వయంగా దొంగతనానికి పాల్పడిన ఘటన బయటపడటంతో భోపాల్ పోలీసులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భోపాల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పనిచేస్తున్న కల్పన రఘువంశీ (Kalpana Raghuwanshi)అనే మహిళా అధికారి తన స్నేహితురాలి ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, భోపాల్‌లోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆమె తన మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి స్నానం చేయడానికి వెళ్లిన సమయంలో డీఎస్పీ కల్పన ఆమె ఇంట్లోకి ప్రవేశించి, హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచిన రూ. 2 లక్షల నగదు మరియు ఒక మొబైల్ ఫోన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కొద్ది సేపటికి తిరిగి వచ్చిన బాధితురాలు డబ్బు, ఫోన్ కనిపించకపోవడంతో వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, అందులో డీఎస్పీ కల్పన ఇంట్లోకి రావడం, బయటకు వెళ్లడం స్పష్టంగా రికార్డయింది. అంతేకాక, ఆమె చేతిలో నగదు కట్ట పట్టుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి.
ఈ ఆధారాలపై ఆధారపడి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని కీలక సాక్ష్యంగా తీసుకుని, డీఎస్పీ కల్పన రఘువంశీపై దొంగతనం కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వెంటనే నిందితురాలు అదృశ్యమయ్యారని, ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిట్టు శర్మ మాట్లాడుతూ..ఫిర్యాదుదారు తెలిపిన మొబైల్ ఫోన్‌ను నిందితురాలి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నాం. సీసీటీవీ ఫుటేజీలో ఆమె స్పష్టంగా కనిపిస్తున్నారు అని తెలిపారు. అయితే, చోరీకి గురైన రూ. 2 లక్షల నగదు ఇంకా దొరకలేదని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఒక సీనియర్ అధికారి ఇలాంటి నేరానికి పాల్పడటం పోలీస్ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, డీఎస్పీ కల్పనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేసు పూర్తిగా పారదర్శకంగా విచారించి, బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ సంఘటనతో ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారి స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించడమే కాక, స్నేహితురాలి విశ్వాసాన్ని ద్రోహం చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. మధ్యప్రదేశ్ పోలీస్ శాఖ ప్రస్తుతం ఈ ఘటనతో గంభీరంగా ఆలోచనలో పడింది.
