శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆయనపై బెదరింపుల కేసు
పీఎస్ బయట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని సుబేదారి పోలీసులు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. క్వారీ నిర్వహిస్తున్నందుకు తనకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తమను బెదిరింపులకు పాల్పడాడని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన ఓ క్వారీ యజమాని సతీమణి ఇటీవల సుబేదారి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యేపై బీఎన్ఎస్ సెక్షన్ 308 (2), (4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
కుట్రలకు భయపడం..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలకు తాము భయపడేది లేదని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం తన బినామీల ద్వారా నడిపిస్తున్న అక్రమ క్వారీ పనులను ప్రశ్నించనందుకే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ, తాను వెనుకాడనని, ప్రభుత్వ పెద్దల అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులను తనను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
కమలాపూర్ మండలంలో సీఎం రేవంత్, మంత్రి సీతక్క బినామీలు క్వారీ నడిపిస్తున్నారని, వాటిని అక్రమ దందా చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని దుయ్యబట్టారు.
ఎంజీఎంలో వైద్యపరీక్షలు..
ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్న పోలీసులు సరాసరి ఆయన్ను వరంగల్‌కు తరలించారు. ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
కేసులు మా సంకల్పాన్ని దెబ్బతీయలేవు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అక్రమ కేసులు బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని దెబ్బ తీయలేవని కొట్టిపడేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రుల అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.