AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల్లో(students) వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ,(Personal hygiene, discipline) మంచి అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ (Mustabu program) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఇది వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గురుకులాలు, వసతి గృహాలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు రోజూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో విజయవంతమైన ప్రయోగం
‘ముస్తాబు’ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది పార్వతీపురం మన్యం జిల్లా. అక్కడ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి గణనీయమైన ఫలితాలు సాధించారు. విద్యార్థుల్లో శుభ్రతపై అవగాహన పెరగడం, దుస్తుల పరిశుభ్రత, జుట్టు క్రమబద్ధత, పాఠశాల సమయపాలన వంటి అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక స్థాయిలో సాధించిన విజయమే ఇప్పుడు రాష్ట్ర విధానంగా రూపుదిద్దుకుంది.
మంచి వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం
ఈ కార్యక్రమం ద్వారా కేవలం శుభ్రతకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం, సామాజిక బాధ్యత వంటి విలువలు చిన్నతనంలోనే అలవడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ‘ముస్తాబు’ అమలుకు సంబంధించిన విధివిధానాలను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వుల రూపంలో విడుదల చేశారు. పాఠశాలలు రోజువారీగా విద్యార్థుల పరిశుభ్రతను పరిశీలించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరూ రోజూ ‘ముస్తాబు’గా పాఠశాలలకు రావాల్సి ఉండనుంది. ఇది విద్యా ప్రమాణాలతో పాటు జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
