Congress : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఇప్పుడే పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సోనియా, రాహుల్‌లతో పాటు మరో ఐదుగురిపై దాఖలైన ఈ ఛార్జ్‌షీట్‌పై విచారణ చేపట్టడం తొందరపాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈడీ దర్యాప్తును కొనసాగించేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు జరిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది.
చట్టపరంగా ఈ తరహా ఛార్జ్‌షీట్‌ను స్వీకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై దిల్లీ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతోందని గుర్తుచేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈడీ ఛార్జ్‌షీట్ ఆధారంగా నేరుగా ముందుకు వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ సుమారు రూ.90 కోట్ల రుణం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రుణ బదిలీ వ్యవహారంలో ఏజేఎల్ ఆస్తులు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోకి వెళ్లాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ యంగ్ ఇండియాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజార్టీ వాటా ఉంది.
ఈడీ అభియోగాల ప్రకారం, కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి యంగ్ ఇండియా సంస్థ ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై నియంత్రణ సాధించిందని పేర్కొంది. ఈ లావాదేవీల వెనుక కుట్ర, మనీ లాండరింగ్ జరిగాయని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా పేర్లను కూడా ఈడీ చేర్చింది. అయితే మోతీలాల్ వోరా 2020లో, ఆస్కార్ ఫెర్నాండెజ్ 2021లో మరణించారు. హైకోర్టు తాజా నిర్ణయంతో సోనియా, రాహుల్‌కు తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ, దర్యాప్తు కొనసాగుతుండటంతో నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయంగా, న్యాయపరంగా మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.
