Aravalli Hills: ఆరావళి పర్వతాల పరిరక్షణ(Aravalli Mountains) విషయంలో ప్రతిపక్షాలు (Opposition parties) వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పష్టంగా ఖండించింది. తాజా నిబంధనల వల్ల పర్వత శ్రేణులకు ఎలాంటి ముప్పు లేదని, వాటి భద్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల అమలుతో ఆరావళి పర్వతాల్లో సుమారు 90 శాతం ప్రాంతం పూర్తిగా సురక్షితంగా కొనసాగుతుందని వివరించింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీకి తావులేదని మరోసారి స్పష్టం చేసింది. ఆరావళి పర్వతాల సరిహద్దులు లేదా నిర్వచనాన్ని మార్చడం ద్వారా మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వం అనుకూలంగా మార్గం సుగమం చేస్తోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది.
నిర్వచనానికి సంబంధించి చేపట్టిన సాంకేతిక మార్పులు కేవలం పరిపాలనా పరమైన స్పష్టత కోసమేనని, భూములను మైనింగ్‌కు అప్పగించే ఉద్దేశం ఏమాత్రం లేదని తెలిపింది. ఈ మార్పులు అమలులోకి వచ్చినా, పర్వతాల రక్షణకు ఉన్న నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆరావళి పర్వత ప్రాంతాల పరిరక్షణ జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తూ, పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు చేపట్టినట్టు పేర్కొంది.
ఆరావళి శ్రేణులు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయని కేంద్రం గుర్తుచేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, భూగర్భ జలాలను కాపాడడం, వాతావరణ సమతుల్యతను నిలబెట్టడం వంటి అంశాల్లో ఈ పర్వతాల పాత్ర కీలకమని వివరించింది. అందుకే ఆరావళి పర్వతాలను కాపాడటమే తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే ప్రసక్తే లేదని, అభివృద్ధి–పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. ఆరావళి పర్వతాల పరిరక్షణపై వస్తున్న విమర్శలు, అపోహల నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
