end
=
Sunday, January 25, 2026
వార్తలుఅంతర్జాతీయంఅమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు తెర.. ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం
- Advertisment -

అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు తెర.. ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం

- Advertisment -
- Advertisment -

US Shutdown : అగ్రరాజ్యం అమెరికా(America)లో చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌ (Shutdown)కు చివరికి తెరపడింది. సుమారు 43 రోజుల పాటు కొనసాగిన ఈ షట్‌డౌన్‌ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఈ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(President Donald Trump) బుధవారం రాత్రి ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లు(Government funding bill)కు సంతకం (signature)చేశారు. దీనితో ప్రభుత్వ యంత్రాంగం మళ్లీ సక్రమంగా పనిచేయడానికి మార్గం సుగమమైంది. ఈ బిల్లుకు ముందుగా రిపబ్లికన్‌ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. అనంతరం ఆ బిల్లు అధ్యక్షుడి సంతకానికి వెళ్లి, కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్‌ దానిపై సంతకం చేశారు. దీంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రారంభమైన ఈ రాజకీయ అస్తవ్యస్త పరిస్థితికి తెరపడింది. ఈ బిల్లుకు మూడురోజుల క్రితమే అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఈ షట్‌డౌన్‌కు కారణం ఫెడరల్ నిధుల బిల్లుపై కాంగ్రెస్‌లో నెలకొన్న అభిప్రాయ భేధాలు. రిపబ్లికన్‌లు ప్రవేశపెట్టిన నిధుల బిల్లును సెనేట్‌ ఆమోదించకపోవడంతో సెప్టెంబర్‌ 30 అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 11:59 నిమిషాల వరకు కాంగ్రెస్‌ సభ్యులు ఒప్పందానికి రాలేకపోయారు. డెమోక్రాట్లు వెనక్కు తగ్గకపోవడంతో వైట్‌హౌస్‌ షట్‌డౌన్‌ను అధికారికంగా ప్రకటించింది. సెనేట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్నప్పటికీ, బిల్లును పాస్ చేయించడంలో విఫలమయ్యారు. ఈ సుదీర్ఘ షట్‌డౌన్‌ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడింది. ప్రభుత్వ ఉద్యోగులలో లక్షలాది మంది జీతం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. వేలాది మంది తాత్కాలికంగా సెలవుపై వెళ్లవలసి వచ్చింది. ముఖ్యంగా విమానయాన రంగం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్‌ఏ సిబ్బంది జీతం లేకుండా విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనారోగ్యం లేదా ఒత్తిడి కారణాలతో కొందరు విధులకు హాజరు కాకపోవడంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి.

ప్రభుత్వ కార్యకలాపాల నిలిచిపోవడంతో పలు ఫెడరల్‌ కార్యాలయాలు మూతపడ్డాయి. పాస్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌, పన్ను రీఫండ్‌లు, అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులు వంటి రంగాల్లో ఆలస్యం చోటుచేసుకుంది. అమెరికా చరిత్రలో ఇంత దీర్ఘమైన షట్‌డౌన్‌ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. చివరకు రెండు పార్టీల మధ్య చర్చల అనంతరం ఫండింగ్‌ బిల్లుకు అంగీకారం లభించడంతో ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు లభించింది. అధ్యక్షుడు ట్రంప్‌ సంతకంతో ప్రభుత్వ ఫండింగ్‌ పునరుద్ధరించబడటమే కాకుండా, దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రభుత్వ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం అమెరికా ప్రజలకు ఉపశమనాన్ని అందించింది. అయితే ఈ షట్‌డౌన్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక, సామాజిక నష్టాల భారం నుంచి బయటపడటానికి దేశానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -