end
=
Wednesday, December 31, 2025
వార్తలురాష్ట్రీయంనూతన సంవత్సరం వేడుకల వేళ.. హైదరాబాద్‌లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు
- Advertisment -

నూతన సంవత్సరం వేడుకల వేళ.. హైదరాబాద్‌లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisment -
- Advertisment -

Hyderabad Police: నూతన సంవత్సర వేడుకలను(New Year celebrations) ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు నగరవ్యాప్తంగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షల(Traffic restrictions)ను అమల్లోకి తెచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఇన్‌చార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకునే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

నగరంలో భారీగా జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్, ఎన్‌టీఆర్ మార్గ్ వంటి ప్రధాన రద్దీ ప్రాంతాల్లో డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 2 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వేడుకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్లైఓవర్ల విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపు ఇస్తూ, మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను పరిస్థితిని బట్టి డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే నగరంలోకి ప్రవేశించే అన్ని ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మీదుగా మళ్లించాలని సూచించారు.

భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగరవ్యాప్తంగా 217 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. షాపింగ్ మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు, పార్టీ హబ్‌లుగా మారే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలను అందరూ బాధ్యతాయుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -