హైదరాబాద్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేసింది. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు ఈ సమాచారాన్ని అందించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
బ్యాలెట్‌పై స్వస్తిక్ గుర్తుతో పాటు మార్కర్ పెన్‌తో టిక్ చేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ గురువారం రాత్రి కౌంటింగ్ కేంద్రాల అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిపై బీజేపీతో పాటు ఇతర ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. బీజేపీ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.