end
=
Monday, December 22, 2025
వార్తలుజాతీయంచెత్తకుప్పలో దొరికిన ‘బొమ్మ’..అది చూసి అధికారులు షాక్‌..!
- Advertisment -

చెత్తకుప్పలో దొరికిన ‘బొమ్మ’..అది చూసి అధికారులు షాక్‌..!

- Advertisment -
- Advertisment -

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని జమ్ము ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. చెత్తకుప్ప(garbage dump)లో దొరికిన ఒక వస్తువుతో చిన్నపిల్లాడు సరదాగా ఆడుకుంటుండగా, అదే వస్తువు పోలీసుల కంట పడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొదట బొమ్మగా కనిపించిన ఆ వస్తువు అసలు రూపం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్ములోని సిద్రా ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి సమీపంలో ఉన్న చెత్తకుప్పలో ఓ పిల్లాడికి ఓ కొత్త తరహా వస్తువు దొరికింది. అది బొమ్మేనని భావించిన ఆ బాలుడు దానితో ఆడుకుంటున్నాడు. అయితే స్థానికుల ద్వారా విషయం పోలీసులకు చేరడంతో వారు అక్కడికి చేరుకుని ఆ వస్తువును పరిశీలించారు. పరిశీలనలో అది అసాల్ట్ రైఫిళ్లు, స్నైపర్ రైఫిళ్లకు ఉపయోగించే టెలిస్కోపిక్ స్కోప్ అని తేలింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఆ ప్రదేశం ఎన్‌ఐఏ కార్యాలయానికి మాత్రమే కాకుండా, సమీపంలోని పోలీసు విభాగానికి చెందిన సెక్యూరిటీ కార్యాలయానికి కూడా దగ్గరగా ఉంది. అంతటి సున్నితమైన ప్రాంతంలో ఇలాంటి సైనిక అవసరాలకు ఉపయోగించే పరికరం దొరకడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీసింది. ఆ టెలిస్కోప్ చైనాలో తయారైనదిగా అధికారులు గుర్తించారు. దీంతో విదేశీ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. వెంటనే ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జమ్ము నగరంతో పాటు ప్రభుత్వ, సైనిక కార్యాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, పరిస్థితిపై పూర్తి నియంత్రణ ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ టెలిస్కోప్ అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు వదిలారు? దాని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్‌ఐఏ ఇటీవలే ఛార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే దిల్లీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడు ఘటనపై కూడా ఇదే సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ సంఘటన వెలుగుచూడటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -