న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 496 పెరగడంతో రూ. 50 వేల మార్కును దాటి రూ. 50,297కు చేరింది. అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల ర్యాలీ కొనసాగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గత ట్రేడింగులో బంగారం ధర పది గ్రాములకు రూ. 49,801 వద్ద ముగిసింది. మరోవైపు, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలోకు ఏకంగా 2,249 రూపాయలు పెరిగి రూ. 69,477కు చేరింది. గత ట్రేడింగులో ఈ ధర రూ. 67,228గా ఉంది.
సోమవారం నాటి ప్రారంభ ట్రేడ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 17 పైసలు క్షీణించి 73.73 వద్ద స్థిరపడింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,898 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్స్‌కు ధర రూ. 26.63గా ఉంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడమే బంగారం ధరల అధిక ట్రేడింగ్‌కు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ పేర్కొన్నారు.