Voters List: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. బూత్-స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) సేకరించిన ఫారాల డిజిటైజేషన్ వివరాల ఆధారంగా, ముసాయిదా ఓటర్ల జాబితా (Voters List)నుంచి లక్షలాదిగా పేర్లు తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం(Election Commission of India) (ఈసీఐ) సిద్ధమవుతోంది. తాజా అంచనాల ప్రకారం, సుమారు 43.30 లక్షల పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే అవకాశముంది. ఈ ముసాయిదా జాబితాను ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం వరకు జరిగిన డిజిటైజేషన్ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనా వెలువడింది. ఫారాల ఎంట్రీ పూర్తయ్యాక తొలగించాల్సిన పేర్ల సంఖ్య మరింత పెరగచ్చని అధికారులు సూచిస్తున్నారు.
అక్టోబర్ 27నాటికి బెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529గా నమోదైంది. ఈ తొలగించనున్న 43.30 లక్షల పేర్లలో పెద్ద భాగం 21.45 లక్షల మంది మరణించిన ఓటర్లది. మరోవైపు, 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిగా గుర్తించారు. అలాగే 5.5 లక్షల మంది ఓటర్లు ఆచూకీ లభించనివారిగా వర్గీకరించబడ్డారు. కాగా బోగస్ లేదా నకిలీ ఓటర్ల సంఖ్య మాత్రం లక్షకు తగ్గుగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఎన్నికల జాబితా సవరణలో భాగంగా వెలుగులోకి వచ్చిన మరో అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,208 పోలింగ్ బూత్‌లలో ఒక్క మరణించిన, నకిలీ లేదా వలస వెళ్లిన ఓటరు కూడా లేరని నమోదు కావడం బీజేపీ అనుమానాలకు దారితీసింది. ఈ బూత్‌ల నుంచి సేకరించిన ఫారాలపై పునఃపరిశీలన చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.
బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో కేవలం మూడు రోజుల్లోనే 1.25 కోట్ల ఫారాలు సేకరించబడటం ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. ఈ రికార్డు స్థాయి నమోదు అనుమానాస్పదమని, ఆ మూడు రోజులలో వచ్చిన ఫారాలపై ఆడిట్ చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ పరిణామాలతో పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కేవలం పరిపాలనా కార్యక్రమంగానే కాకుండా రాజకీయంగా కూడా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముందున్న రోజుల్లో ఈసీఐ తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
