Telangana : తెలంగాణలో కృష్ణా నది నీటి వాటా(Krishna River water share) చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేంద్రానికి తప్పుడు సమాచారం పంపారని సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం రాష్ట్రానికి తీరని నష్టం కలిగించే చర్యగా బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. ఈ నిర్ణయం వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కుదించబడే ప్రమాదం ఉందని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. సమావేశంలో ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర చర్చ జరగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించి పనులను తుది దశకు తీసుకొచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చూపుతోందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని రాజకీయంగా ఎండగట్టాలని భావిస్తున్నారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలనే వ్యూహాన్ని బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. అవసరమైతే జన ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు జిల్లాల్లో జనవరి 2026లో భారీ బహిరంగ సభలు నిర్వహించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్లక్ష్యం, కేంద్రంతో లేఖల వ్యవహారం వంటి అంశాలపై బలమైన డిమాండ్లు చేయాలని పార్టీ భావిస్తోంది. ఇవాళ్టి సమావేశం తర్వాత తెలంగాణ జల హక్కుల కోసం బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటం చేసే అవకాశముందని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
