అరెస్టు చేసినా వెనుదిరిగేది లేదు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఏసీబీ విచారణకు ముందు మీడియా సమావేశం
‘భారత చట్టాలపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మూడు సార్లు కాదు.. 30 సార్లైనా విచారణకు హాజరవుతా. విచారణలో నిజమే చెప్తా. నన్ను అన్యాయంగా అరెస్టు చేస్తరు కావొచ్చు. అయినా.. వెనక్కి తగ్గ. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడటమే మా తప్పయితే.. అది మళ్లీ మళ్లీ చేస్తా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Ex minister KTR) స్పష్టం చేశారు.
ఏసీబీ విచారణ(ACB inquiry)కు హాజరయ్యే ముందు సోమవారం ఆయన మీడియాతో (Press meet)మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతల(Brs Leaders)ను ఇబ్బంది పెడుతున్నదని, అయినప్పటికీ ప్రశ్నించడం మానుకోమని తేల్చిచెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును కాళేశ్వరం విచారణ పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తద్వారా రాక్షసానందం పొందుతున్నారన్నారు.
తప్పుడు కేసులు తమను భయపెట్టలేవని, కేసుల్లో తాను అరెస్టయినా భయపడనని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తాను ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్నామని, ఈ రేస్ కేసులో తాను, ఓటుకు నోటు కేసులో సీఎం నిందితుడన్నారు. తన కేసు విషయంలో ప్రజల సమక్షంలో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని, సీఎంకు దమ్ముంటే ఆయన కూడా లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని, ప్రజల కోసం ఒక్కసారి కాదు.. వందసార్లైనా జైలుకు వెళ్తానన్నారు.
హామీల అమలు చేతకాకనే..
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తేల్చకుండానే సర్కార్ ఎన్నికలకు వెళ్తుందని మండిపడ్డారు. రైతుభరోసాను ఎన్నికలకు వాడుకోబోతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలని, రెండు పార్టీలు కూడగట్టుకుని బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు.