రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా లోకల్ బాడీ ఎన్నికలు
సంకేతాలిచ్చిన మంత్రులు పొంగులేటి, సీతక్క
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిల(Local body elections)కు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. జూలైలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క(Ministers Ponguleti, Seethakka) జిల్లాల పర్యటనలో త్వరలో ఎన్నికలు రానున్నాయని, అందుకు సిద్దం అవ్వాలని క్యాడర్‌కు సంకేతాలిచ్చారు. ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించి..
ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని, 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున నేతలు విభేదాలను పక్కన పెట్టి, పార్టీ విజయం కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నాయకుల మధ్య సరైన సమన్వయం ఉండాలని సూచించారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు(Sarpanch elections) జరుగుతాయని ప్రకటించారు. రిజర్వేషన్లు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క కూడా తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటించారు. సీఎం ఎన్నికల అంశంపై మంత్రులతో సమావేశమై ఇవాళో రేపో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
పాలకవర్గాలు వస్తేనే అభివృద్ధి..
పంచాయతీల పరిధిలోని పాలకవర్గాల పదవీకాలం గతేడాది జనవరి 31తో ముగిసింది. జిల్లా పరిషత్‌ల పదవీకాలం గత సంవత్సరం జూలైలో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేకాధికాల పాలన సాగుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతుండడంతో గ్రామాల్లో పాలన పడకేసిందని విమర్శలు ఉన్నాయి. మరోవైపు గ్రామాభివృద్ధికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు కూడా అందడం లేదు.
పాలక వర్గాలు లేకపోవడంతోనే కేంద్రం ఆ నిధులను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత ఎన్నికలు నిర్వహిస్తే, కొత్త పాలక వర్గాలు తిరిగి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉన్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం నిన్నమొన్నటివరకు ఎన్నికలను పక్కన పెడుతూ వస్తున్నది. కానీ.. ఇప్పుడు మంత్రులు పొంగులేటి, సీతక్క ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికలు తెరమీదకు వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది.
రైతుభరోసా నేడు స్పష్టత..
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుభరోసా సొమ్ము జమ చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 1,500 మంది రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని, ముఖాముఖి సందర్భంగానే సీఎం రైతుభరోసా ప్రకటన చేస్తారని తెలిసింది.
గత ఏడాది మార్చి నుంచి సర్కార్ నిర్వహిస్తున్న ‘రైతునేస్తం’ కార్యక్రమాల్లో ఇప్పటివరకు 6.35 లక్షల మంది రైతులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉండగా, ఇవి కాక మరో 1,034 వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సౌకర్యాన్ని సీఎం ప్రారంభిస్తారు. అలాగే మంత్రులతో కీలక సమావేశం నిర్వహించి స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే సర్కార్ రైతుల ఖాతాల్లో రైతుభరోసా జమ చేసేందుకు సిద్ధమైందని తెలుస్తున్నది. ఈ నెల 25లోపు అర్హులందరి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుందని సమాచారం.