end
=
Thursday, November 6, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంకార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఎక్కడ, ఎప్పుడు దీపం వెలిగిస్తే శుభం...
- Advertisment -

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు వెలిగించాలి? ఎక్కడ, ఎప్పుడు దీపం వెలిగిస్తే శుభం తెలుసా?!

- Advertisment -
- Advertisment -

Kartika Purnima 2025: హిందూ సంప్రదాయాల్లో కార్తీకమాసం (Karthika Masam) అత్యంత పుణ్యమాసంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ప్రతి రోజు ప్రత్యేకమే అయినా, పౌర్ణమి రోజు మాత్రం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా శైవ, వైష్ణవ ఆలయాలు పంచాక్షరి, అష్టాక్షరి మంత్రోచ్చారణలతో మారుమోగుతుంటాయి. నక్షత్రాల్లా ప్రకాశించే దీపాలతో దేవాలయాలు మెరిసిపోతూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.

ఈ పౌర్ణమి రోజున భక్తులు 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఈ సంఖ్య వెనుక గల ఆంతర్యం ఎంతో లోతైనది. సంవత్సరంలో 365 రోజులు ఉన్నందున ప్రతీ రోజు వెలిగించే దీపానికి సమానమైన పుణ్యం ఈ ఒక్కరోజు దీపారాధన ద్వారా లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. దీపం అంటే కేవలం కాంతి కాదు, అది జ్ఞానానికి, చైతన్యానికి ప్రతీక. జీవాత్మ, పరమాత్మల మధ్య ఉన్న సంబంధాన్ని ఈ దీపం సూచిస్తుంది. అందుకే ఏ శుభకార్యాన్ని ప్రారంభించేముందు మొదట దీపాన్ని వెలిగించడం ఆచారంగా ఉంది. దేవుని పూజలో షోడశోపచారాలలో దీపారాధన మొదటి ఉపచారంగా పరిగణించబడుతుంది. ప్రతి రోజు ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంటే ఆ ఇంట్లో దుఃఖాలు, ప్రతికూల శక్తులు అడుగుపెట్టలేవని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం దీపారాధన చేయలేనివారు కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగించి ఆ పుణ్యాన్ని పొందుతారు. అయితే ఈ దీపాన్ని శివాలయాల్లో లేదా వైష్ణవాలయాల్లో కాకుండా ఇంట్లో తులసి మొక్క దగ్గర వెలిగించడం ఉత్తమం. కాబట్టి కార్తీకమాస పౌర్ణమి రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగించి భక్తిశ్రద్ధలతో దేవుని ఆరాధిస్తే, సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం లభించి, జీవితం జ్ఞానప్రకాశంతో నిండిపోతుందని విశ్వాసం.

పురాణాల ప్రకారం, బంగారం, వెండి లేదా మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం శ్రేయస్కరం. కానీ స్టీల్ వస్తువులను దీపారాధనలో ఉపయోగించరాదు. దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా అగరుబత్తి లేదా ఏకహారతి సహాయంతో వెలిగిస్తే శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అలాగే ఒక వత్తితో దీపం వెలిగించడం అశుభంగా, మూడు వత్తులతో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. కార్తీకమాసంలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత ఎంతో గొప్పది. ఈ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి సూచిక. ఈ మాసంలో దీపాన్ని వెలిగిస్తే అంధకారం తొలగి మనసులో జ్ఞానప్రకాశం నిండుతుందని విశ్వాసం. కార్తీకమాసానికి ‘కృత్తిక’ నక్షత్రంతో ఉన్న అనుబంధం కూడా విశిష్టమైనది. ‘కృత్తిక’ అగ్ని సంబంధిత నక్షత్రం కావడంతో, దీపం ఆ అగ్నిదేవుని సూక్ష్మరూపంగా పరిగణించబడుతుంది. అగ్నిదేవుడు ప్రత్యక్ష దేవతల్లో ఒకరు. అందుకే దీపారాధన ద్వారా మనం అగ్నిని ఆరాధించినట్లే అవుతుంది. పౌర్ణమి ఘడియల్లో చంద్రుడి కాంతిలో దీపం వెలిగిస్తే అది అత్యంత శుభప్రదమని నమ్మకం. ఆ దీపం వెలుగు మన జీవితంలో సానుకూలత, సంతృప్తి, శాంతి, సమృద్ధిని ప్రసాదిస్తుంది.

గమనిక: పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -