Rahul Gandhi : దేశంలోని కీలకమైన సంస్థాగత వ్యవస్థలు(Organizational systems) పూర్తిగా బీజేపీ( BJP) గుప్పిట్లోకి వెళ్లాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన నేరుగా దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. జర్మనీలో పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశంలో స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు ఇప్పుడు పాలకపార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), సీబీఐ వంటి సంస్థలు ఇప్పుడు బీజేపీ చేతిలో రాజకీయ ఆయుధాలుగా మారాయి.
ప్రజాస్వామ్యంలో ఇవన్నీ స్వతంత్రంగా పనిచేయాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతలపై ఈడీ లేదా సీబీఐ కేసులు కనిపించవని, కానీ ప్రతిపక్ష నేతలు లేదా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపే వారిపై మాత్రం వెంటనే దాడులు మొదలవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఒక వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని అనుకుంటే, అతడిని బెదిరిస్తారు. దర్యాప్తు సంస్థల పేరుతో ఒత్తిడి తెస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో అనుమతించదగిన వ్యవహారం కాదు అని ఆయన అన్నారు. డబ్బు మరియు అధికారాన్ని ఉపయోగించి బీజేపీ రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.
బీజేపీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ప్రతిపక్షం దగ్గర ఎంత ఉంది? ఈ తేడానే నేటి రాజకీయ వాస్తవం. ఎన్నికలు సమానంగా జరగాలంటే అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. కానీ ప్రస్తుతం అది జరగడం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయడమే కాదని, సంస్థలు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలని రాహుల్ గాంధీ అన్నారు. మీడియా, దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ ఒకే పార్టీ నియంత్రణలోకి వెళ్లిపోతే దేశ భవిష్యత్తుకు అది ప్రమాదకరమని హెచ్చరించారు. దేశ ప్రజలు ఈ పరిస్థితిని గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం తప్పదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని, భయపడే ప్రశ్నే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
