Assembly meetings : ఇటీవల మాజీ సీఎం కేసీఆర్(kcr) నిర్వహించిన ప్రెస్‌మీట్ అనంతరం తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రెండేళ్ల గడువు పొందినా ప్రాజెక్టుల వద్ద చిన్న పనులు కూడా జరగలేదని, మట్టి తవ్వకం వరకు చేయలేదని కేసీఆర్ చేసిన విమర్శలకు అసెంబ్లీ వేదికగానే సమాధానం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తేల్చిచెప్పారు. జనవరి 2 నుంచి నదీ జలాల అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కృష్ణా, గోదావరి జలాల కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన వ్యయంపై సమగ్ర చర్చకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి, మూడు రోజుల విరామం అనంతరం జనవరి 2 నుంచి తిరిగి కొనసాగించాలని సీఎం యోచిస్తున్నారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ‘నీళ్లు-నిజాలు’ పేరుతో విస్తృత చర్చ నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు గట్టిగా ప్రతివాదం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వంలో డీపీఆర్‌లు ఎందుకు వెనక్కి వచ్చాయో, ప్రాజెక్టుల అమలులో ఎక్కడ లోపాలు జరిగాయో ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. నదీ జలాల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా వెల్లడించనున్నారు. అలాగే ఏపీ అనుమతి లేకుండా చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా స్పష్టంగా వివరించనున్నారు.
హైదరాబాద్ నగర విస్తరణపై ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పెంచుతూ నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా 70–80 డివిజన్లతో అదనపు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో ఒకటి ‘సైబరాబాద్’ పేరుతో ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యాక జనవరి తర్వాతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన మంత్రులను సీఎం అభినందించారు. గెలిచిన సర్పంచులను మూడు టీంలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, సంక్రాంతి నాటికి భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిస్థాయి 90 టీఎంసీల ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
