BC Bandh : తెలంగాణ (Telangana)రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ల కోసం బీసీ ఐకాస పిలుపుతో చేపట్టిన బీసీ బంద్ (BC Bandh)శనివారం ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యవసర సేవలు (Emergency services)మినహా అన్ని రంగాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రవాణా, వ్యాపార, వాణిజ్య రంగాలు బంద్ పాటించడంతో ప్రజల జనజీవనం స్తంభించింది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ, విద్యార్థి, ప్రజాసంఘాలూ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, రాస్తారోకాలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాల ఆర్టీసీ డిపోల వద్ద బీసీ సంఘాల నాయకులు బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్, చెంగిచర్ల, కూకట్‌పల్లి డిపోల వద్ద RTC బస్సులు నిలిపివేయబడగా, కూకట్‌పల్లిలో దాదాపు 125 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో ప్రజా రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. RTC డిపోల వద్ద నాయకులు రోడ్డుపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతర కుల సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.
సికింద్రాబాద్‌లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేతలు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఎంజీబీఎస్ వద్ద కూడా బీసీ ఐకాస నేతలు బస్సులను అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోనూ బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. డిపోల నుంచి బస్సులు రాకపోవడంతో ప్రజలు భారీగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబ్‌నగర్ డిపో వద్ద భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్‌గౌడ్ ధర్నాలో పాల్గొనగా, వికారాబాద్ మరియు నిజామాబాద్ డిపోల వద్ద నేతలు నిరసనలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజల సాధారణ జీవనంపై ప్రభావం లేకుండా, శాంతియుతంగా తమ డిమాండ్లను ప్రదర్శించాలని అన్ని సంఘాలను ఆయన కోరారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లలో న్యాయం కావాలనే ప్రధాన లక్ష్యంతో బీసీ ఐకాస పిలుపునిచ్చిన ఈ బంద్ ప్రజల సహకారంతో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం దీనిపై స్పందించాలన్నదే బీసీ సంఘాల డిమాండ్.
