జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విషయంలో విపక్షాలకు అధికార టీఆర్‌ఎస్ షాక్ ఇచ్చిందా..! అంటే ఔననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీఆర్‌ఎస్ పూర్తిస్థాయిలో సిద్ధమై, ఇతర పార్టీలు సన్నద్ధం కావడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. అంతకంటే మూడు నెలల ముందు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దం కావచ్చు.
ఈ నేపథ్యంలోనే.. నవంబరు రెండో వారం తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికల నగారా మోగే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చాలా రోజుల కిందటే తమ పార్టీ నేతల అంతర్గత సమావేశంలో చెప్పారు. దీంతో, నవంబరు ఆఖరు లేదా డిసెంబరు రెండో వారంలోగా గ్రేటర్ ఎన్నికలు ముగుస్తాయనే అంచనాకు విపక్షాలు వచ్చాయి. ఈలోపు దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలు రావటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. కానీ, టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా దుబ్బాక బాధ్యతను పార్టీ తరఫున మంత్రి హరీశ్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించింది. అదే సమయంలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతను అంతర్గతంగా కొనసాగించింది. అయితే, ఊహించని విధంగా అక్టోబరు రెండో వారంలో హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.
మౌలిక సదుపాయాల మరమ్మతుల పనులు పూర్తి కాలేదనే కారణంతో జనవరి చివరి వారం లేదా అదే సమయంలో, షెడ్యూల్‌తో సంబంధం లేకుండా గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ ఇన్‌చార్జీల నియామకం, వివిధ సర్వేలతో అభ్యర్థుల ఎంపిక, ఇతరత్రా క్షేత్రస్థాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని ప్రచారానికి టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం కూడా గ్రేటర్ ఎన్నికలకు ఎప్పుడో సిద్ధమైపోయింది. ఇక, షెడ్యూల్ ప్రకటనతో మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ అప్రమత్తమయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో మునిగి తేలుతున్నాయి. దుబ్బాక ఫలితం అనూహ్యంగా టీఆర్‌ఎస్‌కి ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వ పెద్దలు మనసు మార్చుకొని, గ్రేటర్ ఎన్నికలకు తక్షణమే వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాక ఓటమిని మరిపించే విధంగా జీహెచ్‌ఎంసీని మరోసారి జయించాలని, దాంతోనే బీజేపీకి సమాధానం ఇవ్వాలని టీఆర్‌ఎస్ భావిస్తుందని అంటున్నారు.
జీహెచ్‌ఎంసీ చట్టాన్ని ఆసరాగా చేసుకొని నోటిఫికేషన్ జారీ, పోలింగ్ తేదీకి మధ్య 14 రోజులు మాత్రమే వ్యవధి ఉండేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జాగ్రత్త తీసుకుందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, డిసెంబరు 6న పోలింగ్ ఉండేలా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉండగా, దీనిపైనా ప్రభుత్వం చివరి క్షణంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. డిసెంబరు 6 ‘బ్లాక్ డే’ కావడం, ఆరోజు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ అంటే పరోక్షంగా బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను గుర్తు చేసినట్లు అవుతుందని టీఆర్‌ఎస్ వ్యూహకర్తలు భావించినట్లు సమాచారం.