Bhoomi Shetty : ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వచ్చిన తొలి చిత్రం ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా విశేష విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాకు కొత్త దారులు చూపించిన ఆ చిత్రంతో ప్రశాంత్‌వర్మ (Prashant Verma)సూపర్‌హీరో జానర్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే యూనివర్స్‌లో మరో శక్తివంతమైన కథతో ‘మహాకాళి’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతోంది.ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో తొలిసారి మహిళా దర్శకురాలు రూపొందిస్తున్న ఫీమేల్ సూపర్‌హీరో మూవీ కావడం విశేషం. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ ధృవీకరించారు.
తాజాగా చిత్ర బృందం ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్ రోల్‌లో నటిస్తున్న కన్నడ నటి భూమిశెట్టి మహాకాళి రూపంలో కనువిందు చేశారు. ఉగ్రరూపంలో, దివ్యశక్తిని ప్రతిబింబించేలా భూమిశెట్టి కనిపించిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులు భూమిశెట్టి లుక్‌ను ప్రశంసిస్తూ, ఆమెకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ బెంగాల్ నేపథ్యంలో సాగనుంది. అక్కడి సంస్కృతి, భక్తి, కాళీదేవి ఆరాధనలో ఉండే ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకొని కథని రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. భారతీయ మహిళ సాధికారత, విశ్వాసం, ధైర్యం ఈ మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతుందని, మహాకాళి రూపంలో మహిళ శక్తి ప్రతిబింబిస్తుందని తెలిపారు.
సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కనుంది. ఐమాక్స్ త్రీడీ ఫార్మాట్‌లో సినిమాను చూడగలమని మేకర్స్ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో, భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంగీతాన్ని స్మరణ్‌సాయి అందిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను శ్రీనాగేంద్ర తంగాల నిర్వర్తిస్తున్నారు. కథను స్వయంగా ప్రశాంత్‌వర్మ రాసి, తన యూనివర్స్ విస్తరణకు కొత్త శక్తినిస్తోన్న ఈ చిత్రాన్ని పూజ అపర్ణ కొల్లూరు శక్తివంతంగా మలుస్తున్నారు. ‘మహాకాళి’ చిత్రం విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఇది సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. హనుమాన్ తర్వాత PVCU నుంచి వస్తున్న ఈ కొత్త అధ్యాయం భారతీయ సూపర్‌హీరో విశ్వానికి స్త్రీ శక్తి ప్రతీకగా నిలవనుందనే నమ్మకం ఉంది.
From the cosmic womb of creation awakens the most FEROCIOUS SUPERHERO of the universe!
Introducing #BhoomiShetty as MAHA ❤️🔥 #Mahakali 🔱 @RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/MSyyW1oUK2
— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2025

