Actress Pratyusha: రెండేళ్ల తరబడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు (Actress Pratyusha suicide case) మరో కీలక దశను చేరుకుంది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్న ఈ వివాదంలో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి(Gudipalli Siddhartha Reddy) దాఖలు చేసిన అప్పీల్‌తో పాటు, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విస్తృతంగా విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
2000ల ప్రారంభంలో హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిణిగా ఉన్న ప్రత్యూష, తన సహ విద్యార్థి సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. కుటుంబ సభ్యుల ఒత్తిడులు, వ్యక్తిగత కారణాలు కలిసి 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ కలిసి పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రికి తరలించబడ్డారు. చికిత్స పొందుతున్న సమయంలో ప్రత్యూష ప్రాణాలు కోల్పోగా, సిద్ధార్థ మాత్రం కోలుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిశీలించిన సీబీఐ, అతడిపై ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపిస్తూ సెక్షన్ 306 కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, 2011లో హైకోర్టు శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50 వేలకు పెంచింది. హైకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన సిద్ధార్థ, తాను చేసిన తప్పు ఆత్మహత్య ప్రేరేపణ కిందికి రాదని వాదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ప్రత్యూష తల్లి శిక్షను పెంచాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో సీబీఐ తరఫు న్యాయవాదులు, ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రోత్సహించడం ద్వారా నిందితుడు తీవ్రమైన నేరం చేశారని, అందుచేత గరిష్ఠ శిక్ష విధించాలని విన్నవించారు. అయితే, నిందితుడి తరఫు న్యాయవాదులు పూర్తిగా భిన్నంగా వాదించారు. ఇద్దరూ కలిసి విషం తాగినందున, ఇది ప్రేరేపణ కేసు కిందకు రాదని, భావోద్వేగాల నేపథ్యంలో జరిగిన ఘటనగా చూడాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసు ఏ దిశగా మలుపు తిరుగుతుందన్న ఆసక్తి మళ్లీ పెరిగింది. ఇకపై సుప్రీంకోర్టు తీర్పే ఈ చారిత్రక కేసుకు తుది నిర్ణయాన్ని తెలియజేయనుంది.
