end
=
Thursday, January 1, 2026
వార్తలుజాతీయంఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
- Advertisment -

ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

- Advertisment -
- Advertisment -

Red Fort Blast: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ నెల 10వ తేదీన జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం (Central Govt)అధికారికంగా “ఉగ్రచర్య”గా (terrorist act)గుర్తించింది. ఎర్రకోట సమీపంలో సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటనపై దర్యాప్తు సాగుతున్న కొద్దీ, కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అధ్యక్షతన కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో నవంబర్ 10న ఎర్రకోట వద్ద దేశ వ్యతిరేక శక్తులు ప్రణాళికాబద్ధంగా ఉగ్రదాడి జరిపాయి. ఉగ్రవాదంపై భారత్‌కు ఎటువంటి సహన విధానం లేదు. దాని అన్ని రూపాలపైనా జీరో టాలెరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటిస్తోంది అని పేర్కొంది. ఈ ఘటనపై యూఏపీఏతో పాటు ఇతర ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.

అరెస్టయిన వైద్యుల మొబైల్‌ ఫోన్లలో లభించిన టెలిగ్రామ్ చాట్ల ద్వారా, పాకిస్థాన్‌ ఆధారిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. టెలిగ్రామ్‌ ద్వారా ఆ సంస్థ హ్యాండ్లర్లతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు రికార్డులు చూపుతున్నాయని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధమా? లేక ఫరీదాబాద్‌లో పోలీసులు ఉగ్ర మాడ్యూల్‌ను పట్టుకోవడంతో భయంతో పేలుడు జరిగిందా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఫరీదాబాద్ కేసులో పట్టుబడిన నిందితులతో, ఢిల్లీ ఘటనలో అనుమానితుడైన డాక్టర్ ఉమర్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన విద్యావంతుల నెట్‌వర్క్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించినట్లు సమాచారం. దర్యాప్తు ప్రకారం, ప్రధాన అనుమానితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయీ 2022లో టర్కీకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. అక్కడ వారు తమ హ్యాండ్లర్లను ప్రత్యక్షంగా కలిసిన అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇంకా సేకరించాల్సి ఉంది.

ఇక అరెస్టయిన డాక్టర్ షాహీన్ షాహిద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ మీడియాతో మాట్లాడుతూ..ఆమె జీవితం ఇలా మారిపోతుందని నేను ఊహించలేదు అని అన్నారు. కాన్పూర్‌లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న ఆయన, 2003లో ఇద్దరూ వివాహం చేసుకున్నామని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్లాలనే ఆరాటం ఎప్పుడూ ఉండేది. నేను ఇక్కడే ఉండాలని చెప్పగా, ఆమె మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. 2015లో విడాకులు తీసుకున్నాం, అప్పటి నుంచి ఆమెను చూడలేదు అని చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులు దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో, ఈ ఘటన భద్రతా వ్యవస్థలకు మరో హెచ్చరికగా మారింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -