హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కూకట్‌పల్లిలో జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి రామారావు మాట్లాడుతూ.. నగర ప్రజలకు మాయమాటలు చెప్పి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎలాగైనా విజయం సాధించాలనే కుతూహలంతో బీజేపీ నేతలున్నారని మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం కొత్త బిచ్చగాళ్లు బయల్దేరన్న మంత్రి.. గెలిస్తే చలాన్లు కట్టాల్సిన అవసరం లేదంటున్నారు.
వరద బాధితులకు రూ. 10 వేలు ఇస్తే.. ఈసీకి లేఖ రాసి అడ్డుకున్న వారు.. ఎన్నికల్లో గెలిస్తే రూ. 25వేలు ఇస్తారట. ఇదెక్కడి సిగ్గుమాలిన హామి అని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. బీజేపీ డ్రామాలు హైదరాబాద్‌లో సాగయని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.