Telangana Government: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి చెందిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు (Government offices) హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లాయి. ఈ ప్రక్రియతో హైదరాబాద్‌లోని పలు ప్రధాన ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ, తెలంగాణకు చెందిన కొన్ని శాఖలు ఇప్పటికీ ప్రైవేట్ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నా అద్దె కట్టడాల్లో కార్యాలయాలు నడపడం వల్ల రాష్ట్ర ఖజానాపై అనవసర ఆర్థిక భారం పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది.
ఈ మేరకు అన్ని శాఖలకు సర్కులర్ విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా అద్దె భవనాలను పూర్తిగా ఖాళీ చేయాలని స్పష్టమైన గడువు విధించింది. అంతేకాకుండా, ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై అద్దె చెల్లింపులకు ఎలాంటి బిల్లులు స్వీకరించబోమని కూడా తెలియజేసింది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమ్ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్, ఎర్రమ్ మంజిల్ వంటి ప్రభుత్వ భవనాలను పరిశీలించి, అక్కడికి కార్యాలయాలను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, సీఎస్‌లు, డిపార్టుమెంట్ల ఉన్నతాధికారులను ఆదేశించింది.
జనవరి 1 నుంచి కచ్చితంగా ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అద్దె భవనాలపై ఆధారపడకుండా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో శాఖల పనితీరు కూడా ఒకేచోట ఉండడం వల్ల మరింత మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
